*స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకుంటాం*
*గొడ్డలిపార్టీకి పరాభవం తప్పదు*
*పెదపవనిలో సిసి రోడ్లను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే ఇంటూరి*
*నేతల సమక్షంలో 150 మంది ముస్లింలు టిడిపిలోకి...*
సూపర్ సిక్స్ హామీలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు.
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామంలో 35 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లకు మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబాలు మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
షేక్ మౌలాలితో పాటు జాఫర్, ఖాదర్ వలీ, రహమతుల్లా, షబ్బీర్, నాయబ్, పఠాన్ షబ్బీర్ సహా 150 మందికి పైగా టిడిపిలో చేరగా, నేతలు వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ... తల్లికి వందనం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ పథకాలతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగిందన్నారు.
పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లు, అంతర్గత రోడ్లకు భారీగా నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని అన్నారు.
జగన్ అవినీతి, చేతగానితనం, విధ్వంసంతో నాశనమైన రాష్ట్రాన్ని, కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే గాడిలో పెట్టగలుగుతున్నారని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జగన్ పాలనను తలుచుకుంటేనే ప్రజల్లో వణుకు పుడుతుందన్నారు.
కందుకూరు నియోజకవర్గం లో అభివృద్ధి బాగా జరుగుతోందని, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పట్టుబట్టి నిధులు తీసుకొస్తున్నారని మంత్రి స్వామి ప్రశంసించారు. ప్రస్తుతం కందుకూరు పట్టణాన్ని చూస్తే, అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కందుకూరు మున్సిపాలిటీ తో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి స్థానాల్లో జెండా ఎగురువేసేలా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి స్వామి కోరారు. పెదపవనిలో ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో ముస్లిం సామాజిక వర్గానికి చేసిన మేలును వివరించారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని ఎమ్మెల్యే అన్నారు.
అంతకుముందు మంత్రి స్వామి, ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, గ్రామపార్టీ అధ్యక్షుడు గొర్రెపాటి సాంబయ్య, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, మాజీ సర్పంచ్ నాయక్ రసూల్, షేక్ రఫీ, కరీముల్లా, హిదయతుల్లా, మాబూ, మధు, సురేష్, జనసేన నాయకులు మలిశెట్టి మనోహర్, నాగేశ్వరరావు, మండలంలోని అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Social Plugin