హైదరాబాద్ | అక్టోబర్ 31, 20226
నాలుగు ప్రాంతాల్లో పోలీసుల ఏకకాలిక దాడులు.. 43 మంది మహిళలకు విముక్తి.. 8 మంది అదుపులోకి
హైదరాబాద్: నగరంలో అక్రమంగా అండాల (Oocyte) సేకరణ, వాణిజ్య విక్రయాలకు పాల్పడుతున్న రాకెట్‌ను పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ అక్రమ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో 8 మందిని అదుపులోకి తీసుకోగా, అండాల సేకరణ ప్రక్రియ కోసం తీసుకొచ్చిన 43 మంది మహిళలను రక్షించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపి, అండాల సేకరణ ప్రక్రియ కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను ప్రలోభపెట్టి ఈ వ్యవహారంలోకి దించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బృందాలతో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
మహిళల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన ఈ అక్రమ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? మహిళలను ఏ విధంగా నియమించుకున్నారు? అండాల సేకరణ, విక్రయాల వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
మహిళల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

Social Plugin