విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం!



డివైడర్‌ను ఢీకొని దగ్ధమైన ఈవీ కారు.. నలుగురు సజీవదహనం

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. నంబూరులో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్‌ వాహనం (ఈవీ) కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమై అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం

నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్‌ (39), ఆయన తల్లి అరుణతో పాటు, నంబూరుకు చెందిన తిగురు విజయ, మరో చిన్నారి ఉన్నట్లు సమాచారం.

ఘటనా స్థలంలో విషాదఛాయలు

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ఘోర ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.