బస్సు వెనుక టైర్ల కింద పడి తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబర్ 4:
చిల్లర డబ్బుల విషయంలో జరిగిన వివాదం విషాదాంతంగా మారింది. తనకు వెంటనే చిల్లర ఇవ్వలేదనే ఆగ్రహంతో ఓ ప్రయాణికురాలు మహిళా బస్సు కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
చిల్లర విషయంలో వాగ్వాదం..
వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక తన కుమారుడితో కలిసి మణుగూరు వద్ద భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కింది. కుమారుడికి టికెట్ ఇవ్వాలని కండక్టర్ ప్రవళికకు రూ.100 ఇచ్చింది. అయితే రూ.10 టికెట్ జారీ చేసిన కండక్టర్, మిగిలిన రూ.90 చిల్లరను టికెట్ వెనుక రాసి ఇచ్చినట్లు సమాచారం.
బస్సు నుంచి కిందకు నెట్టడంతో తీవ్రగాయాలు
తనకు చిల్లర వెంటనే ఇవ్వాలని మౌనిక కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ప్రయాణికురాలు ప్రవళికను బస్సు నుంచి కిందకు నెట్టివేసినట్లు సమాచారం. దీంతో ప్రవళిక బస్సు వెనుక టైర్ల కింద పడిపోవడంతో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది.
చికిత్స పొందుతూ మృతి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవళికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. చిల్లర విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ మహిళా ఉద్యోగి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.

Social Plugin