వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. యువతకు ఎంపీ వేమిరెడ్డి సూచన


కందుకూరు, సెప్టెంబర్ 28: వైసీపీ నేతల అబద్ధాలు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి యువతకు సూచించారు. వారి మాటలు విని తప్పటడుగులు వేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


కందుకూరులోని బీఆర్ ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థలకు చెందిన వివేక జూనియర్ కాలేజీలో సోమవారం నిర్వహించిన **‘యువత భవితకు భరోసా’** కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారి సందేహాలను నివృత్తి చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వేమిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నమ్మకం, భరోసా కారణంగానే పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నారని వేమిరెడ్డి తెలిపారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకసారి విఫలమైనంత మాత్రాన నిరుత్సాహపడవద్దని, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. విదేశాల్లో అవకాశాలు పొందిన యువత భవిష్యత్తులో స్వదేశానికి తిరిగి వచ్చి మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కందుకూరు ప్రాంతంలో రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్‌తో పాటు అనుబంధ పరిశ్రమల ద్వారా రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. యువత అందుబాటులోకి వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత భాస్కర్, ప్రిన్సిపల్ అబ్బూరి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రతినిధులు బండి వెంకటేశ్వర్లు, బాలభాస్కర్, నరేంద్రతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.