మహిళ పేరుతో పరిచయం.. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీ లాభాల ఆశ చూపి సైబర్ మోసం
హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ద్వారా పరిచయం పెంచుకుని, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా రూ.29.20 లక్షలు కాజేశారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌లో 'సుకన్య రెడ్డి' పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అనంతరం వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకున్న సైబర్ ముఠా, ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. 'డార్విన్ ఎక్స్ గ్లోబల్' సంస్థలో తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించగా, అందులో లాభాలు వచ్చినట్లు నకిలీగా చూపించారు.
దీంతో సైబర్ ముఠా మాటలు నమ్మిన కానిస్టేబుల్ విడతలవారీగా మొత్తం రూ.29.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అనంతరం అతడి ఖాతాలో రూ.76 లక్షల లాభం వచ్చినట్లు చూపించిన కేటుగాళ్లు, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.12 లక్షలు ఫీజుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
దీంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
అపరిచితుల పెట్టుబడి ఆఫర్లతో జాగ్రత్త!
సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే ఆన్‌లైన్ ట్రేడింగ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి, లాభాల ఉపసంహరణకు అదనపు ఫీజులు డిమాండ్ చేసే మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Social Plugin