మైనర్ బాలికతో షూటింగ్.. ‘ఇరుముడి’ మూవీ


తేదీ: 31-10-2026



బాలిక భద్రత, తల్లిదండ్రుల సమ్మతి, జిల్లా మేజిస్ట్రేట్ అనుమతిపై అధికారుల ఆరా...

తెలంగాణ:

రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ మూవీ టీంను పలు ప్రశ్నలు అడిగారు. బాలిక సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారా? బాలిక తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అనే అంశాలపై వివరణ కోరారు.

అలాగే బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అనే వివరాలను కూడా స్పష్టం చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

బాలికకు చెల్లించిన పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలిక పాల్గొనేలా చేయడంపై కూడా వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, రికార్డులతో నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.