రామాయపట్నం పోర్టు నిర్వాసితుల సమస్యలపై సీఐటీయూ క్షేత్రస్థాయి పర్యటన


అక్టోబర్ 1న పోర్టు పరిధిలోని గ్రామాల్లో జిల్లా నాయకత్వం పర్యటన

నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ, కరువు భృతి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

కందుకూరు: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు పరిధిలోని గ్రామాల నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సీఐటీయూ జిల్లా నాయకత్వం అక్టోబర్ 1న ఆయా గ్రామాల్లో పర్యటించనుంది. ఈ విషయాన్ని పోర్టు నిర్వాసితుల సంఘం కన్వీనర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు శాంతినగర్‌లో పర్యటన ప్రారంభమై ఏలూరుపాడు, సోలార్ ప్లాంట్ గేటు, చేవూరు, రావూరు, సాలిపేట, కర్లపాలెం, రామాయపట్నం పల్లెపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం మీదుగా సాయంత్రం కరేడు చేరుకుంటుందని తెలిపారు.

ఈ పర్యటనలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.వి. కొండారెడ్డి, ఎం. రమేష్, కాలం సుబ్బారావు, జి. శ్రీనివాసులు, పి. కల్పన, సి.హెచ్. మజుందార్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వాసితులు, ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు

రామాయపట్నం పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చేపడుతున్న టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతీ యువకులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని, నిర్వాసితులకు కరువు భృతి అందించాలని కోరింది.

జెట్టి పనులను వెంటనే ప్రారంభించాలని, చేవూరు దళితుల భూములకు నష్టపరిహారం చెల్లించాలని, రామాయపట్నం పల్లెపాలెం, సాలిపేట గ్రామాలను అక్కడి నుంచి తరలించే ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ పర్యటనను ఆయా గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు జీవీబీ కుమార్, ఎస్.ఏ. గౌస్ పిలుపునిచ్చారు.