రూ.1.97 కోట్లతో తారురోడ్డు పనులకు శంకుస్థాపన
రూ.13.5 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు...!
గుడ్లూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు ప్రజల మద్దతు తీసుకొస్తాయని అన్నారు.
గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం నుంచి రాజుగారి చింతలపాలెం వరకు పల్లె పండుగ 3.0 కింద రూ.1.97 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.13.5 లక్షలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు.
ఎమ్మెల్యేకు మండల టీడీపీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గుర్రంపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చారు. సన్నాయి, బ్యాండు మేళాల మధ్య గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారంతో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
గ్రామాల మధ్య అనుసంధాన రహదారులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల ద్వారా పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇండోసోల్, బీపీసీఎల్ పరిశ్రమల ద్వారా చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
అమ్మవారిపాలెం చెరువును రూ.20 లక్షలతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. గ్రామ సమీపంలోని ఎలికేరుపై ఏడాదిలోగా బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీ వాసులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందిస్తామని, గ్రామంలో మూడు బోర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీ-సర్వే ద్వారా రైతులు గతంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముప్పా వీరశేఖర్, క్లస్టర్ ఇన్‌చార్జిలు చిత్తారి మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు నరాల మాలకొండారెడ్డి, దామా వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈ మాలకొండయ్య, మాజీ ఎంపీపీ ఏసుదాసు, టీడీపీ నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు, వెంకయ్య, మేకల మాల్యాద్రి, వేణు, రాఘవులు, మద్దసాని కృష్ణ, రమణమ్మ, పద్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు.

Social Plugin