గుడ్లూరు: మండలంలోని మోచర్ల పంచాయతీ పరిధిలోని తెట్టు ఎస్టీ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు చొప్పున మొత్తం 40 మందికి ఇంటి స్థలాలు కేటాయించారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో కాలనీవాసులు తమకు ఇళ్ల స్థలాలు కల్పించాలని కోరారని, ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. రామాయపట్నం రోడ్డు నుంచి కాలనీలోకి సీసీ రోడ్డు నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు త్వరలో చేపడతామని చెప్పారు.
మోచర్ల పంచాయతీలో రూ.25 లక్షల పంచాయతీ నిధులతో మౌలిక వసతులు కల్పించామని, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని, రూ.20 లక్షలతో స్థానిక చెరువు కట్టను పటిష్టం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే తెట్టు నుంచి రామాయపట్నం మధ్య కొత్త రహదారి నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని, రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ముఖ్యమంత్రి సహాయనిధి వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు.
కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాజా మాథ్యూ, ఇన్‌చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీవో మల్లికార్జునరావు, మండల టీడీపీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ పెదబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, నాయకులు యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ బుజ్జి, సున్నా, మద్దసాని శ్రీను, మద్దసాని వెంకటేశ్వర్లు, పోలుగంగు కృష్ణ, దారా వెంకటరావు, కొమరగిరి జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin