అమ్మకపు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు...!
కందుకూరు, అక్టోబరు 4: ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతుండగా, ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ.35కే విక్రయించేలా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కందుకూరు రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర ధరల భారం పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉల్లిపాయలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అంతకుముందు రైతు బజార్ అధికారులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిణి శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏ.డీ. వరలక్ష్మి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ విజయ్ భాస్కర్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వరూపారాణి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఏఎంసీ డైరెక్టర్ కొత్తూరు సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin