స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి...
ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి.. కార్యకర్తలకు బుర్రా మధుసూదన్ యాదవ్ పిలుపు...
గుడ్లూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించాలని కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుడ్లూరు మండల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. “మీ వెంట మేముంటాం.. స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందాం” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల ఫలితాల లెక్కింపు సమయంలో గుడ్లూరు మండలం ఫలితాలపై కూటమి నాయకుల్లో ఆందోళన మొదలవుతుందని, గుడ్లూరు మండలం వైఎస్సార్‌సీపీకి గుండె లాంటిదని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు కార్యకర్తలవేనని, గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను గ్రామస్థాయిలో వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు. జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరూ తనకు అభిమానులేనని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పార్టీ తరఫున పోటీ చేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే విజయం భవిష్యత్తులో కందుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో తమ విజయానికి పునాది అవుతుందని ఆయన అన్నారు.
పదవీకాలం పూర్తయిన వారికి సన్మానం
ఈ సందర్భంగా పదవీకాలం పూర్తయిన గుడ్లూరు ఎంపీపీ పులి రమేష్, కో-ఆప్షన్ సభ్యుడు షేక్ రషీద్‌లను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Social Plugin