రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయాలి: సీఐటీయూ



గుడ్లూరు: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గుడ్లూరు మండలం చేవూరు గ్రామం నుంచి పోర్టు రహదారి వరకు ప్రదర్శన నిర్వహించి, అనంతరం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎం. రమేష్ మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన రామాయపట్నం పోర్టును వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే దశలో 50 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పేదల నుంచి 850 ఎకరాల భూములను తీసుకోవడంతో పాటు మరో 2,924 ఎకరాలు సేకరించి, ఎకరాకు రూ.1 లీజుతో 50 ఏళ్లపాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు.

పోర్టు ప్రైవేటీకరణ వల్ల జిల్లా అభివృద్ధి, స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విస్తృత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఏపీ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ పోర్టు ప్రైవేటీకరణతో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల్లో ఇప్పటికీ వందల మందికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసులు మాట్లాడుతూ పోర్టు నిర్మాణంతో ప్రభావితమైన గ్రామాలను నిర్వాసితుల జాబితాలో చేర్చకపోవడం అన్యాయమన్నారు. నాలుగు బెర్తుల నిర్మాణానికే రామాయపట్నం పల్లెపాలెం సముద్రం ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని, భవిష్యత్తులో మరిన్ని బెర్తులు పూర్తయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన చేవూరు దళిత రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదన్నారు.

శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. కల్పన మాట్లాడుతూ పోర్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల శ్రామిక మహిళల ఉపాధి దెబ్బతింటుందని అన్నారు. పోర్టు ప్రైవేటీకరణను రద్దు చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, రామాయపట్నం పల్లెపాలెంను నిర్వాసిత గ్రామాల జాబితాలో చేర్చి పునరావాస ప్యాకేజీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు ఇరువూరి బ్రహ్మయ్య, సీఐటీయూ మండల నాయకులు ఎస్.డి. గౌస్, కొట్టే వెంకయ్య, గుత్తి మల్లికార్జున, దామా కృష్ణయ్య, నేలటూరి తిరుపాలు, చేవూరి గగ్గయ్య, లేళ్లపల్లి అంకయ్య, చేవూరి ఇసాక్, చిన్నమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు...