మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!



బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని POCSO కోర్టు ఆదేశం


ప్రకాశం జిల్లా, అక్టోబర్ 30:

మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా POCSO కోర్టు న్యాయమూర్తి కె. శైలజ తీర్పు వెలువరించారు. అలాగే బాధితురాలికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన పొల్లూరి యేబు (25) అనే వ్యక్తి 2020 జూన్ 1వ తేదీన 12 సంవత్సరాల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అప్పటి గుడ్లూరు పోలీస్ స్టేషన్ ASI ఎం. శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కేసు విచారణలో భాగంగా పోలీసులు సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక POCSO మానిటరింగ్ టీం కేసు విచారణను పర్యవేక్షించింది. సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఈ నెల 30వ తేదీన న్యాయమూర్తి కె. శైలజ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.

ఈ కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, POCSO కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., అభినందించారు.