బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నియోజకవర్గంలో తిరగనివ్వమని చెప్పడానికి మీరెవరు




టీడీపీ నేతలపై వైసీపీ యాదవ నాయకుల తీవ్ర విమర్శలు

వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. చేవూరుకు తీసుకెళ్తాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: యాదవ నాయకుల సవాల్‌

కందుకూరు: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నియోజకవర్గంలో తిరగనివ్వబోమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ యాదవ నాయకులు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా నియోజకవర్గంలో తిరగనివ్వకుండా అడ్డుకోవడానికి మీరెవరని మాజీ ఎంపీపీ పెన్నా కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు యాదవ నాయకులు టీడీపీ నాయకుల తీరును విమర్శించారు.

పెన్నా కృష్ణయ్య మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజల్లో పనిచేస్తుంటే కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా యాదవుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కుటుంబాలు శాశ్వతం కావని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు లభించినప్పుడు అడ్డుకోవడం సరికాదని అన్నారు.

చీమల వెంకటరాజా మాట్లాడుతూ, ఎమ్మెల్యే చేస్తున్నారని తాము ఆరోపిస్తున్న కుట్రలను టీడీపీలోని యాదవ సోదరులు గమనించాలని కోరారు. చనమాల శ్రీధర్‌కు బెదిరింపులు, కేసుల భయం చూపించి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాసరి మాలాద్రి వేసిన పిటిషన్ నేపథ్యంలోనూ బెదిరింపులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు స్పందించాల్సి ఉంది. యాదవులపై అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకుండా ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడటం సరికాదన్నారు.

మద్దసాని నవీన్ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని టీడీపీ నాయకులకు సూచించారు. బుర్రా మధుసూదన్ యాదవ్‌ను విమర్శించే వారు హద్దులు దాటవద్దని అన్నారు. పడమటి యాదవుల స్థలాల వ్యవహారం, అన్నెబోయినపల్లి గంగమ్మ జాతర అంశాల్లో యాదవులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఆ సమయంలో ఎమ్మెల్యే ఏం చేశారని ప్రశ్నించారు.

మేకనబోయిన చెంచయ్య యాదవ్ మాట్లాడుతూ, బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని చెప్పడానికి కందుకూరు ఎవరి సొంత జాగీరు కాదని వ్యాఖ్యానించారు. యాదవుల సమస్యలను ప్రశ్నించినందుకు బుర్రాను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.

నక్కల శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బుర్రా మధుసూదన్ యాదవ్‌ను నియోజకవర్గంలో తిరగనివ్వబోమన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుర్రా మధుసూదన్ యాదవ్‌ను చేవూరు గ్రామానికి తీసుకెళ్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు యాదవ నాయకులు పాల్గొని బుర్రా మధుసూదన్ యాదవ్‌కు మద్దతు తెలిపారు. వారిలో పెయ్యల వెంకట రమేష్ యాదవ్, పెయ్యల వెంకట రమణయ్య యాదవ్, ఎందొటి మాల్యాద్రి, వంటేలా శ్రీనివాసులు, కాలేషా యాదవ్, ఎందొటి మురళి, గొర్ల రమేష్, ఈర్ల వెంకటేశ్వర్లు, గంజి మాధవ, దేశబోయిన రామయ్య, ఎర్రగొర్ల నరసింహారావు, కోటు కోటిలింగం, అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, తోట రమేష్ తదితరులు ఉన్నారు.