స్వచ్ఛ కందుకూరే లక్ష్యం.. ప్రజల సహకారం తప్పనిసరి!



8 ఈ-ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

రూ.9 కోట్లతో డంపింగ్‌ యార్డు అభివృద్ధి – త్వరలో సెగ్రిగేషన్‌ కేంద్రం పూర్తి

కందుకూరు, అక్టోబర్ 8: కందుకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. స్వచ్ఛ కందుకూరు సాధనకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

కందుకూరు మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ (SAC) ద్వారా కొత్తగా కేటాయించిన 8 ఈ-ఆటోలను గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణానికి హాని కలిగించని బ్యాటరీ వాహనాలతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతోందన్నారు.

కందుకూరును స్వచ్ఛతలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, రూ.9 కోట్లతో డంపింగ్‌ యార్డును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దూబగుంట వద్ద ఉన్న సెగ్రిగేషన్‌ కేంద్రాన్ని త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

మున్సిపల్ కమిషనర్ కే. అనూష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీను, బెజవాడ ప్రసాద్, వడ్డెళ్ల రవిచంద్ర, షేక్ రఫీ, రూబీ, దామా రాంబాబు, చుండూరి శ్రీను, ఘట్టమనేని సుబ్బారావు, రాయపాటి శ్రీను, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.