తేదీ: 20-10-2026 | మంగళవారం
ప్రకాశం జిల్లా | కందుకూరు నియోజకవర్గం | గుడ్లూరు మండలం
గుడ్లపాలెం–రాళ్లపాడు రోడ్డు అధ్వానం...!
పట్టించుకునే వారేరీ? ప్రజలు, విద్యార్థులకు తప్పని ఇబ్బందులు!
ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల విజ్ఞప్తి
గుడ్లూరు, అక్టోబర్ 20: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం పరిధిలో కందుకూరు–పెదపవని రహదారిపై గుడ్లపాలెం తాడిచెట్టు సమీపం నుంచి రాళ్లపాడు గ్రామం వరకు రహదారి అధ్వానంగా మారింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు అధికారులకు సమస్యను తెలియజేసినా పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతైనా రహదారి సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన రాళ్లపాడు గ్రామస్తులు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అధికారులకు అర్జీలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు
ఈ మార్గంలో గతంలో రెండు బస్సులు నడిచేవని, ప్రస్తుతం ఒక్క బస్సు మాత్రమే నడుస్తుండటంతో ప్రయాణికుల ఇబ్బందులు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు పనులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
గుంతల రోడ్డుతో వాహనదారులకు అవస్థలు
రహదారి సరిగా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బస్సుల ప్రయాణం కష్టతరంగా మారింది. వాహనాల టైర్లు పంక్చర్లు కావడం, ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రహదారి పరిస్థితి కారణంగా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలి
గుడ్లపాలెం తాడిచెట్టు నుంచి రాళ్లపాడు వరకు రహదారిని పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి రహదారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రజలు, విద్యార్థుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుడ్లపాలెం –రాళ్లపాడు రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Social Plugin