హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

 దంతాల అక్రమ విక్రయ గుట్టురట్టు.. నాలుగు దంతాలు స్వాధీనం...!

హైదరాబాద్‌: ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి సంబంధించిన వ్యవహారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఛేదించారు. హైదరాబాద్‌లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు 17 కిలోల బరువున్న ఏనుగు దంతాలను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. దంతాలతో తయారు చేసిన పలు ఐవరీ వస్తువులు, ట్రోఫీలు కూడా అధికారుల స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలిసింది.

ఏనుగు దంతాల అక్రమ రవాణా, విక్రయంపై అందిన సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టి ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న దంతాలు, ఐవరీ వస్తువులపై అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.

ఈ వ్యవహారంలో ఏనుగు దంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.