రైతులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచన
కందుకూరు: తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలు పొందేలా ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు.
రాయలసీమలో కరువు పరిస్థితులను అధిగమించడంతో పాటు ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మదనపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కందుకూరు మండలం ఓగూరులోని రైతు సేవా కేంద్రంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. రైతులకు రాయితీలు అందించడంతో పాటు పంటల ఉత్పత్తి, గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్, నిల్వ కేంద్రాల ఏర్పాటు వంటి సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గాన్ని కూడా చేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకురావడంతో పాటు సబ్సిడీపై స్ప్రింకర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీఈ రహీం, మండల టీడీపీ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు చల్లా నాగేశ్వరరావు, పచ్చవ తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Social Plugin