బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ తరలింపు.. రూ.50 వేల కమిషన్ ఆశ
విజయవాడ: ప్రియుడి బెయిల్ కోసం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సరఫరాకు అంగీకరించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యాలను తీసుకొస్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బషీర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
విజయవాడలోని పటమటకు చెందిన నాగసౌమ్య ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బుల కోసం నాగసౌమ్య డ్రగ్స్ క్యారియర్‌గా మారినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్.. బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలు తీసుకొస్తే రూ.50 వేల కమిషన్ ఇస్తానని ఆమెకు చెప్పినట్లు సమాచారం.
ఈ నెల 13న నాగసౌమ్య బెంగళూరులోని యలహంకకు వెళ్లి, అక్కడ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను తీసుకుంది. అనంతరం బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది. ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ నేతృత్వంలోని పోలీసు బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్లో నిఘా ఏర్పాటు చేశాయి.
రైలులో తనిఖీలు జరుగుతున్న విషయాన్ని గమనించిన నాగసౌమ్య ఫోన్ ద్వారా బషీర్‌కు సమాచారం అందించడంతో అతడు స్టేషన్ నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగసౌమ్యను తనిఖీ చేయగా, ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించిన జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న బషీర్‌ను కూడా బుధవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నేషనల్ స్వాతంత్రం టీవీ వార్తలో నిజం ప్రజల్లో నమ్మకం

Social Plugin