మాలకొండ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పోరాటం


స్థలం: మాలకొండ | తేదీ: 31-10-2026 కందుకూరు, ప్రకాశం జిల్లా ...



సామాన్యుల గొంతుకగా జడ ఈశ్వరమ్మను గెలిపించండి: నేతి మహేశ్వరరావు...

మాలకొండ స్వామి దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి....

మాలకొండ పరిరక్షణతో పాటు సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజాస్వామ్య పోరాటం కొనసాగిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు నేతి మహేశ్వరరావు అన్నారు. వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జడ ఈశ్వరమ్మ మాలకొండ స్వామిని దర్శించుకున్న అనంతరం శనివారం మాలకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాలు సిద్ధాంతాలు, ప్రజాసేవ ప్రాతిపదికన సాగేవని, ప్రస్తుతం డబ్బు ఉన్నవారికే ఎన్నికల్లో అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. డబ్బు రాజకీయాల కారణంగా సామాన్య నేపథ్యమున్న నాయకులు రాజకీయాల్లో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాలకొండ అటవీ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందా?

కందుకూరు ప్రాంత ప్రజల ఇలవేల్పు మాలకొండ స్వామి దేవస్థానం సమీపంలోని ప్రకృతి అందాలు, జీవరాశులకు నిలయమైన అటవీ ప్రాంతాన్ని 2023లో గత ప్రభుత్వం జిందాల్ కంపెనీకి అప్పగించిందని, 2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తోందని మహేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నా మాలకొండ విషయంలో కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత లభిస్తోందని విమర్శించారు. మాలకొండ ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

గ్రామీణ ఉపాధి, రైతుల సమస్యలను పట్టించుకోవాలి

గ్రామీణ ప్రాంతాలు వలసలతో సతమతమవుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా ఉన్న పొగాకు రైతులు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణిస్తూ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

వ్యవసాయం క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రామీణ దళిత కుటుంబాలు బర్రెలు, గొర్రెల పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నాయని, వాటి కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు ప్రయత్నించినా వివక్ష ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దళిత కుటుంబాలకు రుణాలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేయడం వల్ల ప్రజల అసలు సమస్యలు మరుగున పడుతున్నాయని అన్నారు.

డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి విఘాతం

రాష్ట్రంలో పోలీసు, అధికార యంత్రాంగం అధికార పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మహేశ్వరరావు విమర్శించారు. అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయలేని పరిస్థితులు, ముఖ్యంగా కడప ప్రాంతంలో ఏకగ్రీవాల పేరుతో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

నరసన్నపేటలో మైనింగ్ మాఫియాకు సంబంధించిన కేసులు, పార్టీ అంతర్గతంగా ఎదురైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించి జడ ఈశ్వరమ్మను ఎన్నికల బరిలో నిలబెట్టామని తెలిపారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అధికార పార్టీ నుంచి బెదిరింపులు, ప్రలోభాల ప్రయత్నాలు ఎదురైనా ఆమె పోటీలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

పేద దళిత మహిళకు ప్రజలు అండగా నిలవాలి

సొంత ఇల్లు కూడా సరిగా లేని పేద దళిత మహిళ జడ ఈశ్వరమ్మ అధికారంలో ఉన్నవారి బెదిరింపులు, ప్రలోభాలను లెక్కచేయకుండా మాలకొండ పరిరక్షణ కోసం ఎన్నికల బరిలో నిలబడటం అభినందనీయమని మహేశ్వరరావు అన్నారు. సామాన్య ప్రజల సమస్యలను రాజకీయ వేదికపై వినిపించేందుకు ఆమెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

మీ ఓటు మాలకొండ భవిష్యత్తును నిర్ణయిస్తుంది

ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తే మాలకొండ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. పార్టీ జాతీయ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

"మనం చూసిన మాలకొండను మన కొడుకులు, కూతుళ్లు చూడాలి. మన మనవళ్లు, భవిష్యత్ తరాలు కూడా ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలి. రేపటి తరానికి మాలకొండను ఫొటోల్లో మాత్రమే చూపించే పరిస్థితి రాకూడదు. అందుకే మాలకొండ పరిరక్షణ కోసం ఎన్నికల బరిలో నిలిచిన జడ ఈశ్వరమ్మకు ప్రజలు మద్దతు ఇవ్వాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి జడ ఈశ్వరమ్మ, దళిత నాయకులు లింగభద్ర, మాల్యాద్రి, ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడు అజయ్, చుండి నాయకులు గువ్వా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.