ఒంగోలు 150 ఏళ్ల చారిత్రక వైభవానికి ఘన శ్రీకారం
ఘనంగా ప్రారంభమైన 150వ వార్షికోత్సవ వేడుకలు.. హాజరైన ప్రముఖులు
ఒంగోలు: ఒంగోలు నగర 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.డి. అహ్మద్ షరీఫ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయనకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు.
అంతకుముందు ఒంగోలు నగర చారిత్రక వైభవం, సంస్కృతి, అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రముఖులు తిలకించారు. నగరం గత 150 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, చారిత్రక విశేషాలను ఫొటోల రూపంలో ప్రదర్శించడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
150 ఏళ్ల చరిత్రను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఒంగోలు నగర చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పేలా ఘనంగా సాగుతున్నాయి.

Social Plugin