బుర్రా మధుసూదన్‌పై టీడీపీ యాదవ నేతల తీవ్ర ఆగ్రహం

 


“ఎమ్మెల్యే ఇంటూరిపై అసత్య ప్రచారం మానుకోవాలి”

“2029లో పోటీ చేసినా మళ్లీ ఓడిస్తాం”

కందుకూరులో టీడీపీ యాదవ నేతల మీడియా సమావేశం

కందుకూరు, అక్టోబర్ 7:
ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై ఇటీవల ఒంగోలులో జరిగిన ధర్నాలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ యాదవ సామాజిక వర్గం నేతలు తీవ్రంగా ఖండించారు. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కక్ష సాధింపు రాజకీయాలపై ఆసక్తి లేదని, నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆయన దృష్టి ఉందని నేతలు పేర్కొన్నారు. కందుకూరు పట్టణానికి చెందిన వైసీపీ నేత దాసరి మాల్యాద్రిపై నమోదైన కేసులకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేశారని అన్నారు.

లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లి గ్రామంలో గంగమ్మ జాతర విషయంలో కూడా ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. రెండు సామాజిక వర్గాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో శాంతియుతంగా జాతర జరగాలన్నదే ఎమ్మెల్యే ఉద్దేశమని, జాతరను నిలిపివేయాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

ఒంగోలు ధర్నాలో మాట్లాడిన మిరియం శ్రీనివాసులుపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో శ్రీనివాసులు అనేక సందర్భాల్లో పార్టీలు మారుతూ, విభేదాలకు కారణమయ్యారని ఆరోపించారు. అదే సమయంలో ఆయనకు గుండె సంబంధిత చికిత్స అవసరమైనప్పుడు ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పందించి, ఎల్‌ఓసీ ద్వారా రూ.4.26 లక్షల మంజూరుకు సిఫార్సు చేశారని తెలిపారు. అలాంటి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం తగదన్నారు.

“వైసీపీ హయాంలో మాపై కేసులు పెట్టారు”

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి చెందిన సుమారు 20 మంది టీడీపీ యాదవ నేతలపై కేసులు పెట్టి వేధించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అప్పట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులపై జేఏసీలు, యూనియన్లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్న ధర్నాల వెనుక వైసీపీ నేతల ప్రోత్సాహం ఉందని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

“యాదవులను టీడీపీకి దూరం చేసే కుట్ర”

యాదవ సామాజిక వర్గాన్ని టీడీపీకి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. వైసీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం యాదవులు కష్టపడ్డారని, 2029 ఎన్నికల్లో కూడా మరింత కష్టపడి ఇంటూరి నాగేశ్వరరావును గెలిపిస్తామని చెప్పారు. బుర్రా మధుసూదన్ 2029 ఎన్నికల్లో పోటీ చేసినా మరోసారి ఓడిస్తామని వారు అన్నారు.

వైసీపీలో ఉన్న యాదవ కుటుంబాలు టీడీపీలోకి రావాలని నేతలు పిలుపునిచ్చారు. బీసీలకు గౌరవం, రాజకీయ గుర్తింపు కల్పించేది టీడీపీనే అని పేర్కొన్నారు.

“యాదవులకు అనేక పదవులు ఇచ్చారు”

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బీసీలకు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారని టీడీపీ నేతలు తెలిపారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్ష పదవులు, ఏఎంసీ వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు, మాలకొండ చైర్మన్ తదితర పదవుల్లో యాదవులకు అవకాశం కల్పించారని చెప్పారు.

గతంలో తమ సామాజిక వర్గానికి ఎలాంటి గుర్తింపు లభించింది, ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయో యాదవ సోదరులు ఆలోచించాలని వారు కోరారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని బుర్రా మధుసూదన్‌ను టీడీపీ నేతలు హెచ్చరించారు. యాదవులకు ఎవరి హయాంలో నష్టం జరిగింది, ఎవరి హయాంలో గుర్తింపు లభించిందనే అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యేపై అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

సమావేశంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దసాని మహేంద్ర, క్లస్టర్ ఇన్‌చార్జులు చిత్తారి మల్లికార్జున, పోలుబోయిన శ్రీను తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.