గుడ్లూరు, అక్టోబరు 4: గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామ బస్టాండు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞ పరివార దేవతా సమేత శ్రీ సువర్చలా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భక్తుల నుంచి విరాళాలతో పాటు వివిధ వస్తువులు అందుతున్నాయి.
ఆదివారం పాలూరు గ్రామానికి చెందిన బుస్సా రెడ్డి రోశిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.7,200 విలువైన రెండు టేబుళ్లు, నాలుగు కుర్చీలను అందజేశారు. అదే గ్రామానికి చెందిన బుస్సారెడ్డి అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులు రూ.8,500 విలువైన 15 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు గల టార్పాలిన్ షామియానాను సమకూర్చారు.
బుస్సారెడ్డి బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు రూ.3,000 విలువైన 12 షామియానా కర్రలను, ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన వాకా యానాదమ్మ రూ.2,500 విలువైన షామియానా తాళ్ల కోసం ఐరన్ రాడ్లను ఆలయానికి అందజేశారు.
మొత్తం రూ.21,200 విలువైన వస్తు రూపేణా విరాళాలను భక్తులు ఆలయానికి అందించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో తొలిసారిగా నిర్వహించనున్న పూజా కార్యక్రమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ సామగ్రి ఉపయోగపడనుంది.
ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతల కుటుంబ సభ్యులకు, వస్తు రూపంలో విరాళాలు అందించిన భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ ట్రస్ట్ తరఫున హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.

Social Plugin