National Swatantram tv...!
లింగసముద్రం: పల్లె ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా లింగసముద్రం మండలంలో రూ.4.02 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మూడు తారురోడ్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఆర్ఆర్ పాలెంలో పీఎంజీఎస్‌వై నిధులతో రూ.1.15 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు, విశ్వనాథపురం–గంగపాలెం మధ్య రూ.1.97 కోట్లతో నిర్మించనున్న రహదారి, మేదరమిట్లపాలెం–జంగాలపల్లి మధ్య రూ.90 లక్షలతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పల్లె పండుగ 1.0, 2.0, పీఎంజీఎస్‌వై, నాబార్డ్, ఆర్‌అండ్‌బీ తదితర నిధులతో రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.42.64 కోట్లతో 17 తారురోడ్లను నిర్మించినట్లు తెలిపారు.
పల్లె పండుగ 3.0 ద్వారా నియోజకవర్గంలోని ఆరు గ్రామాలకు కొత్తగా తారురోడ్ల నిర్మాణానికి రూ.9.10 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి గ్రామానికి తారురోడ్డు, గ్రామాల్లో అంతర్గతంగా సీసీ రోడ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు.
రోడ్ల నిర్మాణానికి కృతజ్ఞతగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శంకుస్థాపనల అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్ఆర్ పాలెం వద్ద పొగాకు నారుమడిలో పనిచేస్తున్న కూలీలను ఎమ్మెల్యే కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చామని, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు పూరిమిట్ల గురునాథం, క్లస్టర్ ఇన్‌చార్జి వంకాయలపాటి మాల్యాద్రి, గ్రామ పార్టీ అధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు, ఉన్నం రమేష్, కూరపాటి విజయభాస్కర్, త్రోవగుంట వెంగళరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Social Plugin