హైదరాబాద్, అక్టోబర్ 31:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి చెల్లించే కరవు భత్యం (డీఏ), కరవు ఉపశమనం (డీఆర్)ను 19.272 శాతం నుంచి 21.815 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు 2.543 శాతం పాయింట్ల పెంపునకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలను ఆదేశించారు. పెంచిన డీఏ, డీఆర్ 2026 జూలై 1వ తేదీ నుంచి వర్తించనున్నాయి.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు కారణంగా విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు రూ.14.63 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
ధరల సూచీలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో డీఏ, డీఆర్‌లను సవరిస్తుంటారు. విద్యుత్ సంస్థల సిబ్బంది సంక్షేమం, వారి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

Social Plugin