స్వయంగా బైక్ నడిపి యువతలో జోష్ నింపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
తిరుపతి నుంచి కాశీ వరకు ప్రతిష్టాత్మక మోటార్‌సైకిల్ ర్యాలీ
కావలి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి నుంచి వారణాసి (కాశీ) వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సేవా సంకల్ప్ యాత్ర’ గురువారం కావలి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికారు.
పట్టణంలోని ఎస్‌ఎంకే కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొనడంతో కార్యకర్తలు, యువతలో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర తిరుపతి అలిపిరి పాదాల చెంత ప్రారంభమైన ఈ యాత్రలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF), కూటమికి చెందిన 25 మంది ప్రతినిధులు బైకర్లుగా పాల్గొంటున్నారని తెలిపారు. ఎంతో అంకితభావంతో వారు యాత్రను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 8 నాటికి యాత్ర కాశీకి చేరుకోనున్నట్లు వెల్లడించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడమే ‘సేవా సంకల్ప్ యాత్ర’ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ కమిటీ నాయకులు, TNSF ప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు.




Social Plugin