క్షేత్రస్థాయి పరిశీలనలో ఎలాంటి పాదముద్రలు, సంచార ఆనవాళ్లు గుర్తించలేదు
మార్కాపురం: మార్కాపురం చెరువు పైభాగంలోని భ్రమరాంబ వెంచర్ సమీపంలో గత రెండు రోజులుగా చిరుతపులి కనిపించినట్లు పశువుల కాపరుల ద్వారా సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు మార్కాపురం అటవీశాఖ సిబ్బంది సంబంధిత ప్రాంతానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
అయితే పరిశీలనలో చిరుతపులి పాదముద్రలు గానీ, ఇతర సంచార ఆనవాళ్లు గానీ గుర్తించలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
సంబంధిత ప్రాంతం కలుజోలుపాడు బీట్, ఒంగోలు రేంజ్ పరిధిలోకి వస్తుందని అధికారులు నిర్ధారించి, ఈ విషయాన్ని ఒంగోలు రేంజ్ ఆఫీసర్‌తో పాటు సంబంధిత అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు.
దీంతో ఒంగోలు రేంజ్ ఆఫీసర్ మరియు అటవీశాఖ సిబ్బంది గురువారం సంబంధిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి పరిశీలనలోనూ చిరుతపులి పాదముద్రలు లేదా ఇతర సంచార ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడించారు.
అయితే సమీపంలోని మరో ప్రాంతంలో శుక్రవారం కూడా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, అనంతరం వాస్తవ పరిస్థితిని అధికారికంగా తెలియజేస్తామని ఒంగోలు అటవీశాఖ అధికారులు తెలిపారు.
కావున చిరుత సంచారానికి సంబంధించిన అధికారికంగా నిర్ధారించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, ప్రజల్లో అనవసర ఆందోళనకు తావులేకుండా సహకరించాలని అటవీశాఖ అధికారులు కోరారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని అటవీశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
తదుపరి అధికారిక సమాచారం కోసం ఒంగోలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను సంప్రదించాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి.

Social Plugin