తేదీ: 31-10-2026 | ప్రకాశం జిల్లా
ఒంగోలు: ఒంగోలు, చీమకుర్తి, అద్దంకి పట్టణాల్లో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ దిశానిర్దేశం చేశారు. శనివారం ఒంగోలులోని పేస్ కళాశాల, చీమకుర్తిలోని ఇస్లాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అద్దంకిలోని శ్రీ ప్రకాశం జూనియర్ కళాశాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తమకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిని సున్నంతో స్పష్టంగా గుర్తించాలని, ఆ పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వెలుపల మాత్రమే జరిగేలా చూడాలని, స్లిప్పులు తెల్ల కాగితంపై ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు.
ఓటర్లను క్రమపద్ధతిలో క్యూ లైన్ల ద్వారా పంపించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. ఓటర్లు మినహా ఇతరులు అనధికారికంగా లోపలికి ప్రవేశించకుండా చూడాలన్నారు. రాజకీయ పార్టీల గుర్తులు, జెండాలు, కటౌట్లు, ప్రచార సామగ్రి పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో కనిపించకూడదని, పార్టీ గుర్తులతో కూడిన టవల్స్ ధరించి వచ్చే వారిని ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతించరాదని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని, ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, గేట్లు తదితర భద్రతా ఏర్పాట్లు ముందుగానే పరిశీలించాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందని, వారితో సమన్వయం చేసుకుంటూ పోలీసులు విధులు నిర్వహించాలని ఆదేశించారు.
రూట్ మొబైల్ సిబ్బంది, 100 మీటర్ల పరిధిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. ఆర్వో పిలిచినప్పుడు మాత్రమే పోలీస్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది సమయానికి తమ విధుల్లో చేరాలని, సంబంధిత బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని సూచించారు. పోలింగ్ ముగిసిన వెంటనే వాటిని పోలీస్ భద్రత నడుమ రైస్ కళాశాలలోని నిర్దేశిత కేంద్రానికి చేర్చాలని తెలిపారు.
ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ ముగిసే వరకు చురుకుగా విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎన్. యుగంధర్ బాబు, క్రైమ్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ గురునాథబాబు, దర్శి డీఎస్పీ పి. బాలమురళీకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్, పీటీసీ డీఎస్పీ బాలసుందరరావు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







Social Plugin