రామాయపట్నం పల్లెపాలెంను పోర్టు నిర్వాసిత గ్రామంగా గుర్తించాలి!



రామాయపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలి

ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ డిమాండ్‌

కందుకూరు, అక్టోబర్ 15:

రామాయపట్నం పోర్టు ప్రైవేటీక

రణ కోసం 2026 అక్టోబర్ 5న జారీ చేసిన టెండర్లను రద్దు చేయాలని, పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌), భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. రామాయపట్నం పల్లెపాలెంను పోర్టు నిర్వాసిత గ్రామంగా గుర్తించి, బాధితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో డీఏఓ శాంతికి ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు కే. నాంచార్లు మాట్లాడుతూ.. గుడ్లూరు మండలం ఆవులవారిపాలెం, కర్లపాలెం, మొండివారిపాలెం సమీపంలోని సముద్ర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4,929.39 కోట్లతో రామాయపట్నం పోర్టును నిర్మిస్తోందని తెలిపారు. పోర్టు మొదటి దశ నిర్మాణం 85.5 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. ఈ దశలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమై ఆదాయం వచ్చే సమయంలో పోర్టు నిర్వహణను 50 సంవత్సరాల పాటు ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోర్టు నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత తగ్గే ప్రమాదం ఉందని, స్థానికులకు తగిన ఉపాధి అవకాశాలు లభించకపోవచ్చని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చేవూరు సమీపంలోని ఇండోసోల్‌ కంపెనీలో సుమారు 3,000 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, వారిలో స్థానికులకు 300 మందికి కూడా ఉపాధి దక్కలేదని నాంచార్లు పేర్కొన్నారు. స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

రామాయపట్నం పల్లెపాలెం సమీపంలో సముద్ర కోత, ముంపు సమస్యలు ఉన్నందున ఆ గ్రామాన్ని పోర్టు నిర్వాసిత గ్రామంగా గుర్తించి, బాధితులకు పునరావాసం, పునఃస్థాపన (ఆర్‌ఆర్‌) ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. అలాగే రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన చేవూరు దళిత రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. మోహన్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకులు టి. కృష్ణయ్య, రాగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫొటో క్యాప్షన్‌: కందుకూరులో డీఏఓ శాంతికి వినతిపత్రం అందజేస్తున్న ఏఐకేఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ ప్రతినిధులు.