ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ పంకజ్ కుమార్ ...!
పొదిలి: రానున్న స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ పంకజ్ కుమార్ మీనా సూచించారు. శుక్రవారం పొదిలి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ భవనం, పరిసరాలను పరిశీలించిన ఎస్పీ.. స్టేషన్‌లోని వివిధ రికార్డులను తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీసిన ఎస్పీ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాలు, చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ సిబ్బందికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పొదిలి సీఐ ఎం. రాజేష్, ఎస్‌ఐ సూరెడ్డి రాజేష్‌లకు ఎస్పీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Social Plugin