వన్యప్రాణుల సంరక్షణకు సమష్టి కృషి అవసరం..

  National Swatantram tv...!

 మాగుటూరులో వన్యప్రాణి వారోత్సవాలు–2026లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి...!


గిద్దలూరు: వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. అర్థవీడు మండలం మాగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ప్రాజెక్ట్ డైరెక్టర్, మార్కాపురం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాలు–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అటవీశాఖ అధికారులు డివిజన్ పరిధిలో పులుల సంచారం, వాటి కదలికలను గుర్తించేందుకు వినియోగిస్తున్న హైటెక్ కెమెరాలను ఎమ్మెల్యేకు చూపించి, వాటి పనితీరును వివరించారు. పులుల సంచారాన్ని గుర్తించడం, వాటి కదలికలను పర్యవేక్షించడం, వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చేపడుతున్న చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు.

వన్యప్రాణులు, అటవీ సంపద పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కీలకంగా మారిందని అధికారులు వివరించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా అటవీశాఖ అధికారులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.