పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి




గుడ్లూరులో ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

గుడ్లూరు, అక్టోబర్ 7: పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం గుడ్లూరులోని శివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు సుంకర విజయలక్ష్మి, గుడ్లూరు మండల కార్యదర్శి కొట్టే ప్రసన్న మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నాయని విమర్శించారు.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ధరల పెరుగుదలతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నీరుగారిపోవడంతో ప్రజలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకవైపు ఉపాధి అవకాశాలు తగ్గుతుండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు.

పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సుంకర విజయలక్ష్మి, కొట్టే ప్రసన్న, పల్లాపు మల్లేశ్వరి, కొమరగిరి జేలిదమ్మ, మాణికల సుప్రజ, కొమరగిరి లక్ష్మీకాంతమ్మ, పి. అనూష, కొమరగిరి కొండమ్మ, కొప్పోలు నారాయణమ్మ, పొట్లూరి కోటమ్మ, సీఐటీయూ మండల కన్వీనర్ కొట్టే వెంకయ్య, డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి గుత్తి మల్లికార్జున, నేలటూరి తిరుపాల్, ఎం. వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొమరగిరి వెంగయ్య, పొట్లూరి మల్లికార్జున, పొట్లూరి తిరుమలరావు, కొప్పోలు వెంకటేష్, కొమ్మి అచ్చమ్మ, కొమరగిరి నాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, కొమరగిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.