క్రీడా మైదానం మందుబాబులకు అడ్డాగా మారిందా?

 

క్రీడా మైదానం మందుబాబులకు అడ్డాగా మారిందా?

పగిలిన మద్యం సీసాలతో వాకర్లు, విద్యార్థులకు ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్...

కంభం:- కంభం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానం మద్యం సేవించే వారికి అడ్డాగా మారుతోందని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కొందరు వ్యక్తులు మైదానంలో మద్యం సేవించి, ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లను అక్కడే పడేసి వెళ్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మద్యం సీసాలను పగలగొట్టి మైదానంలోనే పడేయడంతో వాకింగ్‌కు వచ్చే వారు, విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాకర్లు తెలిపారు. పగిలిన సీసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్లు వినియోగించే క్రీడా మైదానంలో మద్యం సేవించడం వల్ల పరిసరాల పరిశుభ్రత దెబ్బతినడంతో పాటు అసౌకర్యకర వాతావరణం ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు.

క్రీడా మైదానంలో మద్యం సేవించే వారిపై నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాకర్లు కోరుతున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి మైదానంలో భద్రతా చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.